రాత్రైతే కరెంటు కోత. గది మొత్తం ఉక్కపోత. చిరుగాలి పలకరింపుల కోసం టెర్రస్ పైకి వెళ్లాడు అతడు. ఊరంతా చిమ్మ చీకటి పూసుకుంది. చీకట్లో అటూఇటూ నడుస్తున్నాడు. కళ్ల ముందు జీవితం మొత్తం కనిపించింది. అంతా శూన్యమే. ఉన్నపాటుగా ఏదో గుర్తొచ్చింది. జేబులో నుంచి సిగరెట్టు తీసి, కొవ్వొత్తి వెలిగించడానికి తెచ్చిన అగ్గిపెట్టెలో నుంచి మూడు అగ్గి పుల్లలు వెలిగించాడు. అవి వెలిగిన కొన్ని క్షణాలు, ఆ‌ వెలుగులో నుంచి దగ్గరలో ఉన్న అన్నీ కనిపించాయి. జీవితం శూన్యం కాదని అనిపించింది. 

ఆరిపోతూ ఆరిపోతూ అగ్గిపుల్లలు అతని చేతి వేళ్ళను హత్తుకుని పోయింది. చలనం లేని రాయిలా ఉన్నాడతడు. పెదాల మధ్య ఉన్న సిగరెట్టు పొగలు కక్కుతుంది. ఆ పొగను లోపలికి పీల్చి బయటకు వదిలాడతడు. ఆ చీకటిలో రింగులు తిరిగిన ఆ పొగ అతడిని చూసి చిరునవ్వు నవ్వుతున్న  స్మైలీ ఎమోజీలా కనిపించింది. 

ఇంతలో అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. అమ్మతో మాట్లాడి కాల్ కట్ చేసిన తరువాత అతను ప్రేమించే అమ్మాయి నుంచి ఫోన్ వచ్చింది. వెలుగుతున్న సిగరెట్టును కాళ్ళ కింద వేసి నలిపేసి కాల్ లిఫ్ట్ చేసాడు. నిశ్శబ్దం సంగీతమై, ఆమె మాటలు ఒక పాటై వినిపించాయి అతడికి. హృదయం ఉల్లాసంతో సతమతమవుతుంది. ఊపిరి తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా మారింది. వాటికి  తెలియకుండానే పెదవులు చిరునవ్వు ధరించాయి. చీకటి అందంగా, ఏకాంతం కొత్తగా అనిపించాయి అతడికి. ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు. ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచాడు. ఏం మాట్లాడాడో గుర్తు రావట్లేదు కాని ఇంత ఎక్కువసేపు ఆమెతో మాట్లాడటం ఇదే మొదటిసారి. ఆమె మాటల్లో ఏదో తెలియని మైకం దాగుంటుంది, వినగానే హాయిలో తేలుస్తుంది. కొత్త సంవత్సరం, కొత్త కథ, కొత్తగా పరిచయమైన అనుభూతులతో కాలం ముందుకు పరిగెడుతున్న తరుణంలో కథగా మారిన మరిచిపోలేని క్షణాలు. 

హృదయం జ్ఞాపకాల స్థావరం, 
అజరామరం అక్షరం,
ఈ కథ కల్పితం.