ఎటూ కదలకుండా ఉన్న చోటే అటూ ఇటూ ఊగుతూ గాలిలో తెలుతున్నాయి ఎరుపు రంగు పూసుకుని ప్రేమ చిహ్నపు ఆకారంలో ఉన్న హీలియం బెలున్లు. క్రిందకి చూస్తే వాటి దారాలను అర చేతికి చుట్టుకొని నుంచున్నాడు ఓ పదేళ్ళ కుర్రాడు. వాడి పక్కనే పీచు మిఠాయి ప్యాకెట్లను కర్రకు తగిలించి పట్టుకున్నాడు ఓ పదిహేనేళ్ళ కుర్రాడు. ఆ పక్కనే టింగు టింగు అంటూ ఐస్ క్రీము బండికి తగిలించి ఉన్న గంటకొడుతూ ఓ ఇరవై ఏళ్ళ కుర్రాడు. బజ్జీలు అమ్ముకుంటున్న పెద్దాయన, ఉడికించిన పల్లీలను తట్టలో వేసి, ఆ తట్టను నెత్తిపై పెట్టుకు పోతున్న ముసలమ్మ. దారి పొడుగునా కాసుల కోసం కుస్తీ పడుతున్న జీవుల జాడే. కాసుల వర్షం కురవాలంటే తప్పవు తనువుకు ఇక్కట్లు. 

సిగ్గు, బిడియం పక్కన పెట్టి. ఆత్మాభిమానానికి గంతలు కట్టి. అందంగా ముస్తాబై దేహాన్ని ఒక రాత్రికి అమ్మాకానికి పెట్టింది ఓ గుమ్మ. అటుగా పోతున్న ఆకతాయిల మాటలే తుపాకి తుటాలు, ఆమె హృదయం ముక్కలయ్యింది. చెమ్మగిల్లిన కళ్ళను చేతులతో తుడుచుకుంది కాని లిప్స్టిక్ పెదాలపై నవ్వును చెరగనివ్వలేదు. ఆ క్షణం ప్రేమలో పడ్డాను. ఆమె అందంతో, దేహంతో కాదు బరువెక్కిన గుండెను గంభీరంగా మోస్తున్న ఆమె ధైర్యంతో. ఆమె కన్నీళ్ళు చెప్పాయి ఇది పరిస్థితులు ప్రభావితం చేసిన పిచ్చి నిర్ణయమని. రెండు మనసుల నడుమ అప్పుడప్పుడే చిగురిస్తున్న ప్రేమ, నిశ్శబ్ధంలో శబ్ధాన్ని వెతుకుతున్న ఓ ప్రేమ జంట. గాలిని చూస్తూ కూర్చుంటే శూన్యం కానొస్తుంది. వాడితో వాడే మాట్లాడుకుంటూ జుట్టు పీక్కుంటున్న పిచ్చోడు. 

విళ్ళందరిని దాటుకుని ఒక చోట కూర్చున్నాను. నాతో పాటు తెచ్చుకున్న పాత రేడియోను పక్కన పెట్టి వెనక్కి నడుం వాల్చాను. ముందుకీ వెనక్కీ పరిగెడుతూ అలసిపోతున్న కడలి కెరటాల శబ్ధ తరంగాలు చెవులను తాకుతుంటే కళ్ళు మూసాను. దూరంగా ఎవరో వైయొలిన్ వాయిస్తున్నట్టున్నారు, వినసొంపైన సంగీతం ఎదలో దాగిన గాయాలకు మందు రాస్తుంది. ప్రాణం మదిలో దాచుకున్న జ్ఞాపకాలు నిద్ర లేచాయి. కాలం గడిచిపోయిన గతాన్ని వెలికితీసింది. కళ్ళు తెరిచాను. సింధూర వర్ణపు గులాభిని కురుల చిక్కులో ధరించి, కుంచె పట్టి కేన్వాస్ పై బొమ్మలు గీస్తూ కనిపించింది స్థిర. 

ఏడు రంగుల ఇంద్రధనుస్సు, మంచు కురుస్తున్న ఓ ఉషోదయం, వానలో తడుస్తూ నీటిలో కాగితం పడవలు వదులుతున్న ఓ సాయంకాలం, చలి మంట వెలుగులో వణికిపోతున్న ఓ శీతాకాలం. ఇలా ఋతువులన్నింటినీ కేన్వాస్ పై నింపేసింది. ప్రతీ ఋతువులో కేన్వాస్ పై కామన్ గా ఉంది మేమిద్దరం మాత్రమే. నెమ్మదిగా పైకి లేచి దగ్గరకు వెళ్ళి బుగ్గపై ముద్దిచ్చాను, సిగ్గుతో నవ్వుతూ ముందుకి నడిచింది. ఆమె చేయి పట్టుకుని తనతో పాటు నేను కూడా వెళ్ళాను. మేము నడుస్తున్న దారి ఇసుక తిన్నెల సముద్ర తీరం. అదొక ఆహ్లాదమైన సాయంకాలం.