మేఘమాల
అనగనగా ఒక అందమైన అంధకారం దాని పేరే శూన్యతీరం. శూన్యతీరం ఒక దట్టమైన చీకటి అరణ్యం అనేక రకాల జీవరాసులకు నివాసం. శూన్యతీరంకు సమీపంలో హిరణ్యవర్ణం అనే నది ప్రవహిస్తుంది. ఆ నదికి ఆనుకొని ఒక మర్రి చెట్టూ, చెట్టు చాటున చిన్న పూరి గుడిసె ఉన్నాయి. ఆకలి బాధలు, కడుపు మంటలు, కామ క్రోధాలు రాజ్యమేలుతున్న ఈ లోకంలో డబ్బు అనే చిత్తు కాగితం కోసం నమ్మిన మనుషుల చేతిలోనే మోసపోయి మనుషులు మార్చే రంగులు ఆ ఊసరవెల్లి కూడ మార్చలేదు అని తెలుసుకున్న మరుక్షణం ధనం లేని వనాల వైపుకు దారి మల్లించి పరివారంతో పనిలేకుండా హిరణ్యవర్ణం సమీపంలో గల పూరి గుడిసెలో అజ్ఞాతావాసం చేస్తున్నాడు సూర్యజితుడు అనే ఒక పాతికేళ్ళ యువకుడు. శశి లేని నిశిలా అతని జీవితం ఒక గాడాంధకారం. విశ్రాంతి లేని నాకు అతని జీవితం ఒక ద్రుశ్య కావ్యం. హిరణ్యవర్ణం జన సంచారం మొదలయ్యే చోటు నుంచి చీకటి అరణ్యాన్ని వేరు చేస్తూ ప్రవహిస్తుంది. హిరణ్యవర్ణంలొ ఏరులై పారే నీరు అతనికి సల సల మరిగె రుధిర ప్రవాహంలా కనిపించేది. బహుసా అతని చూపులలొ చిక్కుకున్న గాయాల గతమేమో కదులుతున్న నీరును పొంగే నెత్తుటి ధారగా చూపించింది. అతని కళ్ళు మొత్తం కరిగిన బాధలు పుట్టించిన నీళ్ళతో నిండిపోయాయి. అతని నరాలు అక్షరాలతో ఇంకిపోయాయి. అతను కవిత్వానికి బానిసయ్యాడు. మనుషులే మృగాలని, తన దేహమే తన పాలిట యమపాసమని భావించిన ఇరవై రెండేళ్ళ ఒక అందమైన యువతి జన సంచారం లేని చీకటి అరణ్యాలకు ప్రయాణం సాగించింది. జీవితం ఒక కథల పుస్తకం. ప్రతీ కథ ఒక ముగింపు కోరుకుంటుంది. ప్రతీ పుస్తకం ఏదో ఒక రోజు ముగిసిపోతుంది, రెండో అద్యాయం ఆరంభమవుతుంది. ఒక నిండు పౌర్ణమి సంధ్యా సమయాన సూర్యజితుడు ఒంటరితనంతో సతమతమవుతూ తనతోపాటు తెచ్చుకున్న పుస్తకంలొ అక్షరాలను లిఖిస్తూ,
“ నరములు తిరిగిన కరములు రాసిన కవితలు
ఎన్నో పరుగులు తీసెను ఉరకలు వేసెను
కలలు అలలుగా ఎగిసిన సంద్రం
రోజులు మారిన మారని తీరులు
తీరం కోసం వెతికిన దారులు
గడిచిన కాలం విడిచిన గురుతులు
జ్ఞాపకాలుగా మిగిలిన మనుషులు
అక్షరాలుగా మిగిలిన బాధలు
పుస్తకాలుగా మారిన రాతలు
నాన్న మోసిన ఎన్నో బరువులు
నన్నే మోసిన అమ్మ బాధలు
వెన్నెల కోసం వేచిన రాత్రులు
నక్షత్రాలతొ నిండిన కాంతులు
నింపెను మదిలో ఎన్నో ఆశలు
క్షణాలు తరగని కాలం కోసం
వరాలు కోరే ఒంటరి మనిషి “
అంటూ తనలో తాను మాట్లాడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఆకాశం ఉరుముల మెరుపులతో సందడి చేసింది. మేఘాలు నలుపు ధరించాయి. చినుకులు నేలను తాకాయి. ఆ చిరుజల్లు తాకిడికి అటుగాపోతున్న ఓ అందాల లలన ఎదురుగా ఉన్న మహా వ్రృక్షం క్రిందికి చేరింది. తన శ్వాశను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆ పరిమళానికి కారణం ఎవరా అని శిరమెత్తి ఆమెను చూసాడు సూర్యజితుడు. చిరుగాలి అల్లరికి ఎగురుతున్న కురులతో,పెదవిపై ముత్యాల నవ్వుతో, మోమంతా వెన్నెల వెలుగులా ఆ మబ్బుల చీకటిలో జాబిలే క్రిందికి వచ్చినట్టు కనిపించింది ఆ రూపసి. ఆమె రాకతో గాలంతా సుగంధాలు పరిమళించింది. అతని మనసేమో విహంగమై ఎగరసాగింది. అతని కరము కలముతో కలిసి అక్షరాలకు ప్రాణం పోయగా పుట్టిన కవితను ఆమె వైపు చూస్తూ చదవసాగాడు అతడు.
“ కణం కణం కలిసి పుట్టిన నేను
క్షణం క్షణం కలిసి పుట్టిన కాలం
కడదాకా కలిసి చేసే ప్రయాణం
నిను చూసి ఆగెను క్షణ కాలం ”
అంటూ ఎంత బిగ్గరగా చదివినా ఆమెలో చలనం లేకపోవడం చూసాకా తెలిసింది ఇది నోటి మాట కాదు అతని మనసు మాట అని. కాని అతను పుస్తకంలో రాసే అక్షరాలు నాకు ఎప్పుడూ కనిపించేవి కావు కేవలం వినిపించేవి మాత్రమే. వారి తొలి పరిచయం చూసాకా నాకు వసంతాన్ని హత్తుకున్నంత హాయిగా అనిపించింది. మెల్ల మెల్లగా మేఘాల రంగు ఆకాశం ధరించింది. ఆమె మాత్రం శిల్పంలా అలాగే నిలుచుంది. భయంకరంగా ఉరిమిన గగన క్రోధానికి భయపడిన ఆ కోమలి సూర్యజితుని భుజాలపై తల వాల్చింది. ఆమె సున్నితమైన కురుల తాకిడికి స్పందిస్తూ శిరస్సును వెనక్కి తిప్పి తన కన్నీటి నయనాలను తిలకించాడు సూర్యజితుడు. ఆమె కళ్ళలో ఏదో తెలియని భయం చూసాడు, చెప్పుకోలేని భాదను చూసాడు. ఆ క్షణంలో తన కలాన్ని నిలిపివేసి జారుతున్న ఆమె కన్నీటి బిందువును ముని వ్రేళ్ళతో తుడిచాడు. ఆ చిరు చీకటిలో వారి కళ్ళు మాట్లడుకున్నన్ని మాటలు వారి పెదవులు కూడా పలకలేవేమో అనిపించింది. వారిరువురి నేత్ర సంభాషణను వారి మధ్య చేరిన గాలి నాకు వివరించసాగింది. ఈ అందచందములు,మనోహర రమణీయములు శాశ్వతం కాదు క్షణికం మాత్రమే అని ఆమె సూర్యజితుడికీ, దేహంతో సంబంధం లేని మనసు ఎప్పటికీ చిన్నదేననీ, గుచ్చి గుచ్చి మాట్లడే ప్రతి మాట ముల్లే అని, ఎదుర్కొనే మనసుకు బండలాంటి గుండెలని, భాష లేనీ భావాలకు గూడే ఈ మనసు అని, వయసు కేవలం ఒక అంకె అని తెలుసుకున్న నాడే ఈ జీవితం సుఖాంతమవుతుంది అని భయపడుతున్న ఆమెకు ధైర్యాన్ని చెప్పాడు సూర్యజితుడు. ఈ సంభాషణకు సారాంశం నాతో ప్రయాణీంచే వారి ప్రాయమేనని తెలుసుకొని తెలియకుండానే వారి మౌన సంభాషణలో నేనూ ఒక భాగమయ్యాను. ఇంతలో ఆ చిరు చీకటి కాస్తా చిమ్మ చీకటిగా మారింది. చీకటిని తరుముకుంటు వచ్చిన చుక్కలూ, చుక్కల నడుమ చంద్రుడు, చంద్రుని వెంట వెన్నెల అన్నీ కట్ట కట్టుకొని ఆ అందాల భామను సూర్యజితుడు వెలిగించిన దీపాల వెలుగులో చూడసాగాయి. ఉదయం నుంచి మంచి నీరు కూడా తాకని ఆమె కోసం సూర్యజితుడు పంచభక్ష్యపరమన్నాలతో సమానమైన ఆహారాన్నివడ్డించాడు. ఆ వెన్నెల రేయిలో, పూరి గుడిసెలో, దీపాల వెలుగులో, వర్షం సాక్షిగా మొదలైన ఆ విందు నాకు కన్నులవిందుగా అనిపించింది. వారిద్ధరి మధ్య మౌనం రాజ్యమేలుతుంది. ఆ నిశబ్ధాన్ని బద్ధలుకొడుతూ ,
“కాలం వేగం పుంజుకుంటుంది
గడిచిపోయినది గతమవుతుంది
గతమైనది జ్ఞాపకమవుతుంది
చేదైనా, తీపైనా అది మనతోనే ఉంటుంది ”, అంటూ పొలమారిన ఆమెకు మంచి నిళ్ళ గిలాస ఇచ్చి ఒక చిరు నవ్వు నవ్వాడు సూర్యజితుడు. కాని ఆమె ముందు ఉంచిన కంచంలో అన్నమూ తరగలేదు ఆమె చేతిలో గిలాసా నిలవలేదు. నాకు ఒక్క క్షణం అంతా అయోమయంగా అనిపించింది. “మనసు కోరె వాంఛలనే తనువు తీరుస్తుందా లేదా తనువు కోరె వాంఛలకే మనసు లొంగుతుందా. వొళ్ళు కప్పుకొని తిరగలేదంటారు కాని మీరు కళ్ళు కప్పుకోరెందుకు. ఈ దేహం మీ కళ్ళకు ఒక వ్యసనం. మీరు కోరేది నొప్పించే సుఖం కావచ్చు కాని కనిపించని గాయాలతో మనసు పడే వేదన చచ్చేది కాదని ఒక్కరికీ తెలియదు. పసి కందులని సైతం వదలని ఆ కామాంధుల మూలం ఏమిటో ఆ దేవుడికే తెలియాలి. మట్టిలో కలిసిపోయే ఈ దేహం కోసం ఎందుకు అంత ఆరాటం. ఆడదానికి ఈ దేహం దేవుడిచ్చిన శాపం. మోసే భాద ఎప్పుడు భారమవుతుందో తెలుసా, ఆ భాద ఎప్పటికీ తీరదని తెలిసాక”, అని నిశబ్ధానికి వేసిన సంకెళ్ళను తీసి పెదవి విప్పింది కన్నీరు తుడుచుకుంటున్న ఆ అబల. అర్ధరాత్రి 11:00 గంటలు కావొస్తుంది ఆ నిశీది మౌనంలొ వారి పెదవి మౌనం చెరిగిపొయింది. “ఇంతకీ మీ పేరు చెప్పలేదు”, అని ఆమేను అడిగాడు సూర్యజితుడు. “కరిగి చినుకులను కురిపించే ఆ మేఘాల వరుస”, అని చెప్పింది ఆమె. అది విని అయోమయంగా చూస్తున్న సూర్యజితుని వైపు చూసి మేఘమాల అని నవ్వుతూ చెప్పింది ఆ సొగసరి. తనివితీరా ఒక నిమిషం నవ్వుకున్నారు ఇద్దరూ. సూర్యజితుని వైపు చూసి ఎందుకు మీరు ఇలా ఒంటరిగా ఉంటున్నారు అని అడిగింది మేఘమాల. నేను ఒంటరిగా ఉన్నా అని ఎవరు చెప్పారు. నాకు నా కలం తోడు,నా కన్నీరు తోడు, నా గుండె చప్పుడు తోడు. నేను ఒంటరిని కాదు అంటు ఆ దీపాల చిరు వెలుగులో తన పుస్తకం తెరచి,
“ఏకాంతంలో తను నా సొంతం
చీకటిలో తను నా ధైర్యం
ప్రయాణంలో తను నా గమ్యం
జీవితంలో తను నా విశ్వం”, అంటూ ఒక కవితను రాసాడు సూర్యజితుడు. “ఎవరు తను”, అని అడిగింది మేఘమాల. “తను నేను ప్రేమించే అక్షరం”, అని నవ్వుతూ సమాధానమిచ్చాడు సూర్యజితుడు. ఒంటరితనం అంటే నిన్నునీకు పరిచయం చేసే ప్రయాణం. అది నిజమే కాని అమ్మ, నాన్న, కుటుంబం విల్లందరిని వదిలేసి మీరు మాత్రం సుఖంగా ఉంటే సరిపొతుందా అని అడిగింది మేఘమాల. నేను ఒక అనాధను అంటు మౌనంగా ఉండిపోయాడు సూర్యజితుడు. మీకు అక్షరాలు తోడున్నంత వరకు మీరు అనాధ కాదు అని తన చేయి సూర్యజితుని భుజాలపై వేసి అధిమింది మేఘమాల. ఆ రాత్రి ఎన్నో వేల మాటలు వారి మనసులు దాటి పెదవులు దాటయి. మేఘమాల నిదురించిన కొన్ని క్షణముల తరువాత,
“ నీలాకాశాలా వీధులలో తిరిగే మేఘాల నడుమ
అనంత విశ్వాల అందాల నడుమ
నిశీధి నలుపులొ మెరిసే నక్షత్రాల నడుమ
ఆమె ఉనికి నా చీకటి అర్ధాన్నే మార్చేసింది”, అంటూ ఆమెతో చెప్పలేని మాటలన్నింటినీ తన పుస్తకంలో పధిలపరిచాడు. కొంత సమయం తరువాత పుస్తకాన్ని చేతిలో ఉంచుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నడు సూర్యజితుడు. అనంతరం చీకటి తొలగి రవి రాకతో ఆకాశాన వేకువ చేరుకుంది. ఆ ఉదయం నిద్రలేవగానే అతని కళ్ళు వెతికిన మొదటి వ్యక్తి మేఘమాల. కోయిల పాట, వేగంగా కదిలే నిళ్ళ చప్పుడు, వీచే గాలి శబ్దం, పువ్వుల చుట్టూ తిరిగే సితాకోక చిలుకలతో ఆ రోజు చాలా కొత్తగా మొదలయ్యింది. వెతికి వెతికి అలసిపోయిన అతని కనులకు హిరణ్యవర్ణం ఒడ్డున మౌనంగా కూర్చొని కనిపించింది మేఘమాల. ఇంతకు మునుపు రక్తవర్ణం దాల్చిన ఆ నీరు ఇప్పుడు చాలా స్వచ్ఛంగా కనిపించింది అతనికి. మరుక్షణం ఆమె దగ్గరకు వెళ్ళి, “ఇలా ఒంటరిగా కూర్చున్నారు ఎవరైనా గుర్తొచ్చారా” అని అడిగాడు సూర్యజితుడు. “ వేగంగా కదిలే ఆ నదిలొ నీరును చూసారా, నా రక్తం కూడ నరాలలో అంతే వేగంగా కదులుతుంది. ఆడదాన్ని కదా ఏమీ చేయలేకపోతున్నా” , అని నిస్ప్రుహతొ సమాధానం ఇచ్చింది మేఘమాల. కోపంలో ఇలా వచ్చేసారు మి అమ్మనాన్న మీ కోసం వెతుకుతూ ఉంటారు కదా, మరి ఎందుకు ఈ ఒంటరి పోరాటం. “అలాంటి ఇబ్బందులు ఏవి లేవు నాకు ఎందుకంటే మీలాగే నేను కుడా అనాధని”, అని జవాబిచ్చింది సుర్యజితుడు అడిగిన ప్రశ్నకు నవ్వుతూ. “కాసేపు మనిద్దరి పగలు ప్రతికారాలు పక్కనపెట్టి ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదిద్దామ”, అని అడిగాడు సూర్యజితుడు. నాకు ఈ అరణ్యాన్ని చూపిస్తారా. “క్రూర మృగాలు తిరిగే చోటు అది, అక్కడికి వెళ్ళటం చాలా ప్రమాదకరం”, అని ఆమె వైపు చూసాడు అతను. “ఈ భూమి మీద మనిషి కంటె క్రూరమైనది ఏదీ ఉండదని నా అభిప్రాయం”, అని మౌనంగ చూస్తూ ఉండిపోయింది మేఘమాల. సరే పదండి, మీ కోరికను నేనెందుకు కాదంటాను అని మేఘమాల అడిగిన మాటలకు చీకటి అరణ్యాలకు బయలుదేరారు వాళ్ళిద్దరు. సూర్యజితుడును అనుసరిస్తూ అతని పాదాల గుర్తులలో అడుగులు వేస్తూ నడవసాగింది మేఘమాల. వారి పాదాల ముద్రలు మాత్రం నాకు కనిపించలేదు. బహుశా వారి అడుగులను గుర్తులుగా గర్భంలో దాచుకుందేమో ఆ నేల. వారి రాకతొ చీకటి అరణ్యం వెలుగులు చిమ్మసాగింది, అరణ్యంలో నివసించే మూగ జీవులకు వీచే గాలి సంగీతంల వినిపించింది. ఇంతలో సూర్యజితుడును వెంబడిస్తున్న మేఘమాల అడుగులు దారి తప్పాయి. అప్పటి దాకా ఆమె గుండె చప్పుడును వింటున్న సూర్యజితుడిని ఒక్కసారిగా మౌనం చుట్టుముట్టేసరికి వెనక్కి తిరిగి చూసాడు. మేఘమాల కనిపించకపోవటంతో సూర్యుడు నింగిని వీడే సమయం వరకు వెతికి అతను వెలుగుని వీడి చీకటి తోడుగా ఇంటికి వెనుదిరిగాడు. అతను వెనుదిరిగి సాగిన మార్గంలో అడుగులు నేలకు చాలా భారంగా తాకాయి బహుశా అతని బాధ అతి బరువైనది అనుకుంటా. భువి ఓర్వలేని భారాన్ని అతని మనసు ఏలా ఓర్చిందో. సూర్యజితుడు ఇంటికి చేరే సమయానికి మర్రి చెట్టు క్రింద కూర్చొని సూర్యజితుడి పుస్తకాన్ని తెరచి ఖాళీ పేజీలను తిరగేస్తూవుంది మేఘమాల. పుస్తకంలో అక్షరాల కంటె అతని ఒంటరితనమె ఎక్కువ కనిపించింది ఆమెకు. ఆమెను అలా చూసిన మరుక్షణం ఆనందంతో పరుగు పరుగున ఆమె వద్దకు చేరి “ఏమైపోయావు ఇంతసేపు?, నన్నువదిలేసి వెళ్ళిపోయావనుకున్న, ఇంక తిరిగిరావనుకున్న, నిను చూపించమని అడిగిన నా కళ్ళకు సమాధానం చెప్పలేకపోయా, నా శ్వాసకు నీ పరిమళ జాడను తెలుపలేకపోయా, నీ అడుగుల చప్పుడును అనుసరించే నా గుండెల చప్పుడు పిచ్చి దాని వలె అరవసాగింది, నువు దూరం చేసిన ఒంటరితనం మళ్ళీ దగ్గరవుతుందేమోనని భయమేసింది”, అంటూ మోకాళ్ళపై నిల్చుని చిన్ని పిల్లాడి వలె ఏడవసాగడు. ఇదంతా విన్న మేఘమాలకు అతనిని ఎలా ఓదార్చాలో తెలియలేదు. “ మీ నుంచి ఎక్కడ దూరమౌతానో అని నాకు కూడా భయమేసింది తెలుసా. ఏమో మనిద్దరికి కలిగిన ఈ భావనకు ఏమని పేరు పెట్టాలో అర్ధంకావట్లేదు.ఈ భావాన్ని ప్రేమ అని మాత్రం పిలవొద్దు”, అని సూర్యజితుడును ఒడిలోకి తీసుకుని ముని వ్రేళ్ళతో అతని తలపై నిమురుతూ ఓదార్చసాగింది మేఘమాల. అలా వారిద్దరు ఒకరి ఒడిలొ ఒకరు తల వాల్చి నిద్రలోకి జారుకున్నరు. కరిగిపోయినా, కొన్ని క్షణములు చెరిగిపోవు. అలాంటి వాటిలో ఈ కొన్ని వేల క్షణములు చిరస్మరణీయం. మరుసటి రోజు ఉదయం నిదురలేవగానే మేఘమాలపై ఉన్న భావాలన్నింటినీ, “అనగనగా మేఘమాల. అందమైన చారుశీల. ఆమె గుణం అగ్గి జ్వాల. వేల కోట్ల పగడాలే విలువలేని రంగురాళ్ళు,ఆమె నవ్వు కురిపించే అందమైన ముత్యాలే విలువైనా రత్నాలు. మౌనమేల శబ్దమేల ఆమె మాట విన్న వేళ, తనువంతా ఏదోలా పరవశించి ఎగిరేలే విహంగాల రెక్కలలా, వసంతాల కౌగిలిలో సేధతీరె రాతిరిలా. జోలాలీ అను వేళా ఆమె ఒడే అమ్మ ఒడై ఒరిగినాను మనసారా”, అంటూ ఆ అక్షరాలను తన పుస్తకంలొ ఒక కథలా భద్రపరిచాడు సూర్యజితుడు. ఇంతలో వెనుక నుంచి, “నాకు ఈ జీవితంపై ఎందుకో ఆశ కలిగింది. నాకు ఇక్కడే ఉండిపోవాలని ఉంది. ఈ ఒంటరి పక్షి గూటిలో జతగా చేరాలని ఉంది”, అంటూ తియ్యని గొంతుతో పలికింది మేఘమాల. ఆమె మాటలు విని వెనక్కి తిరిగిన సూర్యజితుడిని ఒక్కసారిగా తన కౌగిలిలో బంధించి అతని చెవిలో, “ఈ ఉదయం మొదలు నా ఊపిరి ఆవిరిగా మారి మరలా ఆ నిశీధి నిన్ను చుట్టుముట్టేదాకా నీ వెంటే ఉంటా”, అని ప్రేమగా ఒక మాట చెప్పింది. “ఈ క్షణం మొదలు నా జీవిత ప్రయాణంలో నువ్వే నా ఆఖరి గమ్యం, నీతోనే నా ఆఖరి గమనం. నీ నులివెచ్చని కౌగిలిలొ నేనెప్పటికీ బంధీనే.”, అని ఆమె చెవిని ప్రేమగా అతని పెదవులతొ ముద్దాడాడు. పంచభూతాల సమక్షంలో వారి కౌగిలి చుట్టూ ఏర్పడిన ఆ వలయమే ప్రేమ. వారు చేసుకున్న ప్రమాణాలే వారి ప్రేమకు పునాదులు. అసలు ప్రేమంటే ఏమిటో అనే ఆలోచనకు వస్తే మనసు మోసే అతి బరువైన భావమే ప్రేమ. రెండు మనసులు కలిస్తేనే ప్రేమ సంపూర్ణం లేదంటే శూన్యం. రాలిపోయిన ఆకులను చూసి, బోసిపోయిన చెట్టు కోసం పరుగులు తీసే వసంతమే ప్రేమంటే. చిమ్మ చీకట్లో వెలుగులు పొంగిస్తుంది. జ్ఞానేంద్రియాలను అతలాకుతలం చేస్తుంది. ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
“ ఓడను మోసే కడలిలా,
చెట్లను మోసే భూమిలా,
తారను మోసే నింగిలా,
ప్రేమను మోసెను మనసిలా !! “
మోయటానికి బరువుగా ఉన్నా పంచుకొనే తోడు ఉన్నంత వరకు బరువుగా అనిపించదు. వారు వెళ్ళిపోయిన తరువాత భాదలా మిగిలిపోతుంది కాని నీడలా వెంటే ఉంటుంది. చీకట్లా చుట్టుముట్టేస్తుంది. కళ్ళను నీట ముంచేస్తుది. కాలాన్ని కదలనివ్వదు. పొగలు కక్కే రుధిరంతో హ్రుదయం బుసలు కొడుతుంది. కలమనే ఆయుధంతో కరము కదం తొక్కుతుంది. అంధకారంలో అందమైన అక్షరాలకు ప్రాణం పోస్తుంది. వారి రూపం నరాలలో ఇంకిపోతుంది. నిశీధిలో నక్షత్రంలా మెరిసిపోతుంది. వయసు తరిగిపోతుంది. కాని ప్రేమ శాశ్వతంగా నిలిచిపోతుంది. చరిత్రలో ఒక కథలా లిఖించబడుతుంది. నేను ఎన్నో వేల ప్రేమ కథలు చూసాను కాని వాటిలొ కొన్నిమాత్రమే గెలిచాయి మిగతావన్నీ చావుని గెలిచి చరిత్ర పుటలలో నిలిచిపోయినవే. అన్ని కథలలో అమ్మ ప్రేమ మాత్రం అమృతంలా ఉంటుంది. వేగంగా రోజులు గడుస్తున్నాయి వారి మధ్య ప్రేమ కూడా అంతే వేగంగా పెరుగుతూ వచ్చింది. ఆ రోజు అమావాస్య, ఉదయం 6:00 గంటలు అయ్యింది వారిద్దరు ఏకంతంగా హిరణ్యవర్ణం దగ్గర కూర్చొని ఒకరి కోరికలు ఒకరు చెప్పుకోసాగారు. “మేఘమాల!! నాకు నగరంలో చిన్న పని ఉంది. నేను అది చూసుకొని వెంటనే వచ్చెస్తాను, నువ్వు ఇక్కడే ఉండు.”, అని చెప్పి నగరానికి బయలుదేరాడు సూర్యజితుడు. నగరం చేరిన పిమ్మట మేఘమాల కోసం ఒక చక్కని పట్టుచీర కొనుగోలు చేసుటకై వస్త్రాల దుకాణంలోకి ప్రవేశించాడు అతడు. అక్కడ నిలబడి వస్త్రాల వ్యాపారి కోసం ఎదురుచూస్తున్న సూర్యజితుడును దుకాణంలో ఎవ్వరు పట్టించుకోకపోయేసరికి కోపంతో గట్టిగా అరిచాడు. ఆ శబ్దానికి అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాని అతను ఎవ్వరికీ కనిపించలేదు. వారి వైఖరితో విస్తుపోయిన సూర్యజితుడు అక్కడి వ్యాపారి చొక్కా పట్టుకోవడానికి ప్రయత్నించగా అతడి రెండు చేతులూ ఆ వ్యాపారి శరీరంను పట్టుకోలేకపోయాయి. ఆ క్షణం అతనికి ఏమి జరుగుతుందో అర్ధంకాలేదు. ఒక్క నిమిషం తధేకంగా ఆలోచించగా గుర్థొచ్చింది, అతడు చనిపోయి చాలా రోజులయ్యిందని. కాని మేఘమాలకు మాత్రం తను ఎందుకు కనిపిస్తున్నాడో అస్సలు అర్ధంకాలేదు. అతను ఆమెకు మాత్రమే కనిపిస్తున్నాడు అంటే ఆమె కూడా చనిపోయి ఉంటుంది అని భావించి అక్కడి నుంచి వంద అలోచనలతో ఇంటికి చేరుకున్నాడు సూర్యజితుడు. అతడి కోసం వేయి కనులతో వేచి చూస్తున్న మేఘమాలను చూసి, “ఇంత కాలం మన దేహాల కలయిక నిజమనే భ్రమలోనే ఉన్నాను. కాని ఆ నిజమే ఒక అబద్ధమని తెలిసాకా ఈ దేహంలేని మనసుకు చాలా భారంగా ఉంది మేఘమాల”, అని ఆమెను గట్టిగా హత్తుకొని ఏడవసాగాడు అతడు. “ఏమైంది మీకు, ఎందుకు ఏడుస్తున్నారు, మీరు ఏమంటున్నారో నాకు అర్ధంకావట్లేదు”, అని ఆశ్చర్యపోయిన మేఘమాలతో మనం చనిపోయాం మేఘమాల, ఈ విధి ఆడించిన వింత నాటకంలో మనం కేవలం పాత్రలు మాత్రమే. మన కథ మొదలుకాక ముందే కథలు కథలుగా ముగిసిపోయింది అని ఆమెకు అర్ధమయ్యేలా చెప్పాడు సూర్యజితుడు. “మరి ఎందుకు మనం ఇంకా ఈ భూమి మీద మిగిలే ఉన్నాము మనకు మోక్షం కలగదా”, అని సూర్యజితుడును అడిగింది మేఘమాల. “కోరికలు తీరకుండా ఏ ఆత్మ భూమిని విడిచిపెట్టి పోదు. మనిద్దరి కోరికా కలిసి బ్రతకాడమే. గుర్తుపెట్టుకో మన మనసుల కలయిక నిజమైనప్పుడు మనల్ని ఆ చావు కూడా విడదీయలేదు”, అని ఏడుస్తున్న మేఘమాలను ఓదార్చసాగాడు. ఈ సృష్ఠిలో నాలుగు యుగాలు. కృత యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, మరియు కలి యుగం. ఈ నాలుగు యుగాలను కలిపి ఒక దేవ యుగం అంటారు. కృత యుగాన్ని సత్య యుగం అని కూడా అంటారు. సత్య యుగంలో నాలుగు కాళ్ళ మీద నిలబడే ధర్మం కలి యుగంలో ఒంటి కాళ్ళ మీద నిలబడుతుంది. దేవ యుగంలో ఆఖరిదైన కలి యుగం వచ్చే సమయానికి మనిషికి కామం, క్రోధం, కల్మషం, దురాశ అన్నీ ఎక్కువ అవుతాయి. వీటి వల్ల ధర్మం కుప్పకూలిపోతుంది. ధర్మం కుప్పకూలిన రోజు ఈ సృష్ఠి అంతమైపోతుంది. మరలా ఒక కొత్త దేవ యుగం మొదలవుతుంది. ఈ అంతమయ్యే యుగానికి ఆరంభమయ్యే యుగానికీ మధ్య ఇంకొక యుగం ఉంటుంది. ఆ యుగమే అనంత యుగం. కొన్ని లక్షల సంవత్సరములు గడిచిన తరువాత కలి యుగంలో ఒక పంచ పౌర్ణమి జరుగుతుంది. ఆ రోజు యుగంలో ఒక్కసారే వస్తుంది. పంచ పౌర్ణమి రోజు తీరని కోరికలతో చనిపోయిన వారి ఆత్మలు వారి పూర్వ దేహాన్ని ధరిస్తాయి. ఆ దేహం గడిచిన పౌర్ణమి తరువాత వచ్చే అమావాస్య దాకా బ్రతికి ఉన్న మనిషి లాగే ఉంటుంది కాని వాటికి ఆకలి దప్పికలు ఉండవు. అలాగే వారు ఎవ్వరికీ కనిపించరు, ఎవ్వరినీ తాకలేరు. వారిని కూడా ఎవ్వరూ తాకలేరు. వారు చనిపోయారు అని కూడా వారికి తెలియదు కాని వారి మాటలు మాత్రం అందరికీ వినిపిస్తాయి. వారు ఏ వస్తువు ఉపయోగించినా అది పని చేయదు. ఆ దేహం తిరిగి అమావాస్య రోజున గాలిలో కలిసిపోతుంది. ఆ రోజు మరణించిన వారు అనంత యుగంలో పంచభూతలలో ఒకరిగా పుడతారు. ఈ సృష్ఠిలో మనిషికి దేవుడు ఇచ్చిన అతి పెద్ద వరం ఏదైన ఉంది అంటే అది ఇది ఒకటే. అదే పంచ పౌర్ణమి రోజు నమ్మిన స్నేహితుల చేతిలో సూర్యజితుడు, కొంత మంది రక్కసుల కామ వాంఛలకు మేఘమాల ప్రాణాలు కోల్పోయి ఆ విషయం తెలియకుండానే శూన్యతీరానికి వచ్చేసారు. నిజానికి వారి కథ ముగిసిపోయాకే మొదలయ్యింది. ఇది అంతంతో మొదలైన ఆరంభం. వెలుగు వెనకాల నిత్యం కదలాడే చీకటిలో మొదలైన రెండవ అధ్యాయం. అమావాస్య ముగిసే వేళయ్యింది. శూన్యతీరం చుట్టూ చీకటి కమ్ముకుంది. ఆ చీకటిలో వారిద్దరూ హిరణ్యవర్ణం నీటి ఒడ్డున తేలుతున్న పడవలో నీటి ప్రవాహానికి ఎదురేగసాగారు. ఆ చీకటి ఒడిలో చందమామ లేదు, చుక్కలు లేవు, వెన్నెల లేదు కాని వారి దేహాలే వెలిగే అగ్ని జ్వాలలా ఉన్నాయి. ఆ నడి రేయిలో ఇరు వైపులా చెట్లతో హిరణ్యవర్ణంపై తేలుతూ మినుగురుల సమూహంతో పడవంతా వెలిగిపోతుంది. “నేను మీ రాతల పుస్తకాన్ని తెరచి చూసాను అందులో ఒక్క అక్షరం కూడా కనిపించలేదు కాని నా కోసం రాసిన కొన్ని వందల అక్షరాలు వినిపించాయి నను మైమరపించాయి. మీ పెదవులతో ఆ పదాలను ప్రత్యక్షంగా వినాలని ఉంది.”, అని సూర్యజితుడి వైపు ప్రేమగా చూస్తూ చెప్పింది మేఘమాల.
“కనుల చీవర కన్నీటి ధార కురిసింది ఈ వేళ,
మధుర సంభాషణలు జరుగు ఈ నిశీధి వేళ,
అంతరంగాల అంతర్గతాలు పెదవి విప్పిన ఈ వేళ,
ఆత్మబంధాలు అక్షరాలతో అల్లుకున్న ఈ వేళ,
శూన్యతీరాన సూర్యజితుడికి తోడుగా చేరింది ఈ మేఘమాల”, అని కదులుతున్న పడవలో నుంచి తన దోసిటలోకి నీరును తీసుకోని మేఘమాలపై చల్లాడు సూర్యజితుడు. అమావాస్య కూడా పండు వెన్నెలలా అనిపించింది ఆ క్షణం. మన దేహాలు ఇంకా మనతోనే ఉన్నాయి అంటే అది ఆ దేవుని వరమనే చెప్పాలి అని సూర్యజితుడు అన్న మరుక్షణం వారి కళ్ళముందే వారి శరీరాలు మట్టిలా కరిగి హిరణ్యవర్ణంలొ కలిసిపోయాయి. ఒక్కసారిగా ఆ ప్రదేశాన్ని నిశబ్ధం చుట్టుముట్టింది అంతా కటిక చీకటిలా మారిపోయింది. వారిద్దరు ఉన్న పడవ ఒంటరిగా మిగిలిపోయింది. ఇంతలో చీకటినీ, నిశబ్ధాన్నీ చీల్చుకుంటూ ఒక తెల్లటి ఆకారం మరియు మేఘమాల మేఘమాల అంటూ అరుపులు వచ్చాయి. ఆ అరుపులకు స్పందిస్తూ నేను ఇక్కడే ఉన్నాను అంటూ ఇంకొక తెల్లని ఆకారం ప్రత్యక్షమైంది. ఇప్పుడే కదా వరమని అన్నారు కాని ఇలా శాపంలా మారిపోయింది ఏమిటి అని సూర్యజితుడును అడిగింది మేఘమాల. ఏమో ఆ దేవుని లీలలు అర్ధం చేసుకొవటం చాలా కష్ఠం మేఘమాల అని మౌనంగా ఉండిపోయాడు సూర్యజితుడు. కొంచెంసేపటి తరువాత అలా ఆకాశంలో ప్రక్క ప్రక్కనే తేలాడే తెల్లని మేఘాలలా వారి ఇద్దరి ఆత్మలూ హిరణ్యవర్ణం సమీపంలోని మర్రి చెట్టు వద్దకు చేరి నిలిచాయి. ఆ రోజు రాత్రి వారిద్దరి కోపానికి ఆకాశం భయంకరంగా ఉరుములతో మెరవసాగింది. వారి భాదను నిచ్చల మేఘాలు పంచుకొని కన్నీరుగా వర్షాన్ని కురిపించసాగాయి. ఆ వర్షం తాకిడికి హిరణ్యవర్ణం ఉప్పొంగింది, సమీపంలో ఉన్నపూరి గుడిసె వారి ఆత్మ వేదనతో మారు మ్రోగింది. ఆ రాత్రిని జ్ఙాపకంగా మోయటానికి నాకు చాలా బరువుగా అనిపించింది. అలా వెలుగు దరి చేరే వరకూ కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించే సమయానికి శూన్యతీరం నిశబ్దంతో నిండిపోయింది. ఆ ఉదయం అద్రుశ్యమైన వారి జాడ ఏ దిక్కూ కానరాలేదు. కాలాలు వేగంగా కదులుతున్నాయి తరాలు పెరుగుతున్నాయి దశబ్ధాలు మారుతున్నాయి అదే విధంగా వారిద్దరి మధ్య ప్రేమ కూడా పెరిగింది ఆ ప్రేమ ఒక్కటిగా కాలేదని శోకం కూడా పెరిగింది. వారిద్దరూ విశ్వంలో ఎక్కడ ఉన్నారో తెలియదు కాని వారి ప్రేమ మాత్రం అహర్నిశలూ ప్రతిధ్వనిస్తూనే ఉంది. వారు కనుమరుగైన మరు క్షణం శూన్యతీరం తమస్సు ధరించి నిశబ్దంగా తపస్సు చేయసాగింది. అవి సూర్యుడు భగ భగమని మండుతున్న రోజులు. ఒక రోజు శూన్యతీరాన ఉన్న చీకటి అరణ్యాలను కార్చిచ్చు అంటుకుంది. ఒక్కసారిగా చీకటి అరణ్యం మంటలలో చిక్కుకుని సకానికి సకం కాలి బూడిదయింది. ఆ అంతరమున సూర్యజితమేఘమాలల శోకానికి మేఘాల కలయిక తోడై ఆకాశం వర్షించింది. అప్పటికే అడవి పూర్తిగా దగ్ధమై మూగ జీవుల గూడు చెదరిపోయింది. విచిత్రమేమిటంటే ఆ వన్య ప్రాణులకు ఏ హాని జరగలేదు. ఒక అమావాస్య చీకటి రోజున ప్రేమలో విఫలమై ప్రాణాలు కోల్పోతున్న ఒక జంటను చూసి మేఘమాల సూర్యజితుల ఆత్మలు ఆ ఇద్దరి శరీరాలను అవహించాయి. మరలా శూన్యతీరానికి పూర్వ వైభవం వచ్చింది. ఆ పూరి గుడిసె వారిద్దరి నవ్వులతో సందడిగా మారింది. “ ఎన్ని రోజులయ్యింది మేఘమాల నిను తనువులో తనివితీరా చూసి. నీ రూపం మారినా, కళ్ళలో మాత్రం అదే ప్రేమ కనిపిస్తుంది.”, అని సూర్యజితుడు మేఘమాలను చూస్తూ ఒక మాట వదిలాడు. “ మీ రూపం మారినా మీరు చూపించే ప్రేమ మాత్రం మీరు అమితంగా ప్రేమించే అక్షరాల కంటే తీయ్యగా మారింది.”, అంటూ సూర్యజితుని ఒడిలో వాలిపోయింది మేఘమాల. అలా రోజులు గడిచే తరుణంలో గూడు లేని మూగ జీవులకు కాలి బూడిదైన చీకటి అరణ్యంలో మొక్కలను పెంచి మరలా దట్టమైన వనంలా తీర్చిదిద్దరు వారిద్దరు. అలా ఆ మూగ జీవులన్నీ వారికి ప్రేమతో చేరువయ్యాయి. కాలక్రమేణా మనిషి నరరూప రాక్షసుడిలా రూపాంతరం చెందాడు. మనిషి యొక్క జ్ఞానం మట్టిలో కలిసిపోయింది.
“ మిన్నునంటే అరాచకత్వం మనిషితత్వం,
తమస్సు మింగిన వెన్నెలేమో మానవత్వం.”, అని ఒక మనిషి చెప్పగా విన్నాను. కలి యుగం ముగిసే సమయానికి ధర్మం పూర్తిగా కనుమరుగైపోయింది. ఏ దిక్కు చూసినా కుళ్ళు కుట్ర కుతంత్రాలతో పూర్తిగా మునిగిపోయింది. అలాంటి రోజుల్లో ఒక పౌర్ణమి రోజున పంచభూతాల ఆగ్రహాన్నీ తోలిసారిగా చవిచూసాను. ఆకాశం గూలబి రంగులోకి మారింది. సముద్ర గర్భంలో ఊపిరిపోసుకున్న నీటి ఉప్పెన, బండ రాళ్ళను సైతం కదిలించే పెను గాలి, గాలిని కూడా వెంటాడే నిప్పు కణాలు, క్రూరంగా కంపించిన భూమి, క్రోధంగా గర్జించిన ఆకాశం. ఇవన్నీ మమేకమై ఒక్కటిగా భూమండలంపై విజృమ్బించాయి. అదే కలి యుగంలో ఆఖరి రోజని కలలో కూడా ఊహించలేదు. కానీ ఈ అఖిలాండ విధ్వంశాల నడుమ వారిద్దరు చెక్కుచెదరకుండా శూన్యతీరాన నరుల ప్రవాహంతో ఉప్పొంగుతున్న హిరణ్యవర్ణం వద్ద ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ప్రేమించుకోసాగారు. ప్రేమ ఎంత గొప్పదో ఆ క్షణం నాకు అర్ధమైంది. అలా కొన్ని రోజుల పాటు జరిగిన విధ్వంసం ముగిసింది. అగ్నిగర్భాన్ని శూన్యం ఆక్రమింఛింది. వారి ఆత్మలు ఆక్రమించిన దేహాలు మన్నులో కలిసిపోయాయి. వారి భావాలను నాలో భద్రంగా దాచాను. కలి యుగం ముగిసింది. ఒక దేవ యుగం ముగిసి ఇంకొక దేవ యుగం మొదలయ్యే రోజులవి. తనకు తానుగా కలిగి సమస్తం తానే కలుగజేసిన విశ్వనియంత ఆజ్ఞ మేరకు అనంత యుగం ఆరంభమైంది. పంచ పౌర్ణమి రోజు మరణించిన సూర్యజితుడు మన్నై, మేఘమాల మిన్నై అనంత యుగంలో మరలా జన్మించారు. ఎల్లప్పుడూ మేఘమాలను తలచే సూర్యజితుని యొక్క ఒక్కొక్క తలంపు ఒక్కొక్క విత్తనమై, అనంత యుగంలో మన్నుతో నిండిన పుడమి చెట్లతో నిండిపోయింది. ఈ భూమికి చెట్లు భారం కాదు ప్రేమ అని రుజువైన క్షణం అది. మిన్నే తానై మన్నుని తాకే ఆరాటంలో మేఘమే ఒక వాహనమై నీరులా నేలను చేరింది అందాల మేఘమాల, సూర్యజితుని ప్రేమలో తేలుతున్న ఆ స్వప్నబాల. అక్కడ నింగినేలల మధ్య దూరం ఎంతంటే వారి ప్రేమలో దాగిన అనంతమైన శూన్యమంత. ఆనాటి నుంచి అనంత యుగం ఒక అందమైన ప్రేమకు నిలయంగా నాలో ఐక్యమైపోయింది.
“ మెరిసే తారల ఆకాశం వేచెను యుగాలు నీ కోసం,
కదిలే చూపుల వలలో చిక్కిన ముత్యము నీ రూపం,
కలమే కరముకు జతకాగా రాసిన ఓ కవిత్వం,
నీ నవ్వులు హరివిల్లుల రంగుల వసంతం,
చీకటిని అలంకరించే మినుగురుల సంతోషం,
నిను వర్ణించే పదముల తరగని ఉల్లాసం,
చేరుకోలేని తీరాల కోసం మనసు చేసే ప్రయాణం,
మేఘమాల !! జాబిలికి పూచిన వెన్నెలా, ఓ పుత్తడి బొమ్మలా, దోచావే నా మనసును దొంగలా”, ఇదే అతడు మేఘమాల కోసం రాసిన అందమైన ఆఖరి కవిత్వం. ఇంతకీ నేనేవరో చెప్పలేదు కదా. నా మూలం నాకే తెలియని ఒక నిగూఢ రహస్యం. ఎలా చెప్పను? ఏమని చెప్పను? నేనేవరని చెప్పను? వినండి నా కథను,
“పరిగెడుతు పరిగెడుతు అలసిపోను నేను,
క్షణమైన యుగమైన మీ వెంటే వస్తాను,
మంత్రాలే మార్చలేని యంత్రాలే చేర్చలేని,
జ్ఞాపకాలు ఉప్పొంగే సముద్రాన్ని నేను”
ఈ జీవన జగతిలో సమస్తం నాతో కదిలి కథలా మారే గతమే. కరిగే క్షణమూ నేనే, మరువని క్షణమూ నేనే. మనిషి మనుగడ మొదలైన నాటి నుంచి కాలం అనే నామన్ని కలిగి ఉన్నాను. నేను ఎంత దూరం ప్రయాణించినా, వెనుదిరిగి చూసిన మరుక్షణం కనిపించే మొదటి కథ సూర్యజితుడి మదిలో నిలిచిన మేఘమాలదే. సూర్యజితుడి అక్షరాల పుస్తకంలో కాగితాలు ఖాలీగా ఉన్నా, మేఘమాల కోసం దాచిన ఒక భావాల సముద్రమే దాగి ఉంది. అంతరంగాల అంతర్గతాలు అంతులేని అన్వేషణలు ఆత్మవిశ్వాస ఆగ్గిజ్వాలలై అహర్నిశలూ అచంచలమైసాగిన ఒక అమానుష ప్రేమ గాధ ఇది.

6 Comments
Your story had stolen my sleep😍
ReplyDeleteNice story brother
ReplyDeleteFantafabulous🤩👌
ReplyDeleteఒంటరితనం అంటే నిన్నునీకు పరిచయం చేసే ప్రయాణం. This is beautiful. I don’t know about the story behind this. But it made me sad after reading. My mom loved it too. ����
ReplyDeleteNinnu gurtinchalekapooyam Sur
ReplyDeleteMagnificient.
ReplyDelete